modi: అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితా: టాప్ 10లో మోదీ, 48వ స్థానంలో ఒబామా
ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 74 మందితో కూడిన ఈ జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదో స్థానం కైవసం చేసుకొని టాప్ టెన్‌లో నిలిచారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరుసగా నాలుగో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచారు. ఆ తరువాత అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలవగా ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం 48వ స్థానంలో నిలిచారు. మూడు, నాలుగవ స్థానాల్లో జర్మనీ చాన్స్‌లర్ మెర్కల్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఐదో స్థానంలో ఉండగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 7, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 10వ స్థానంలో నిలిచారు.
భారతీయుల్లో మోదీకి ఎంతో పాప్యులారిటీ ఉందని పేర్కొన్న సదరు పత్రిక భారత్‌లో వాతావరణ మార్పులు, భూతాపం లాంటి అంశాల్లో ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసించింది. భారత్‌లోని అవినీతి, మనీలాండరింగ్‌ల నిరోధం కోసం ఈ ఏడాది నవంబరులో పెద్దనోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.