: ప్రధాని వస్తారు.. సమాధానం చెబుతారు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు


మరో  మూడు రోజులపాటు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నా విపక్షాలు పడనీయడం లేదని ఆయన విమర్శించారు. సభను పదేపదే అడ్డుకుంటూ నానా యాగీ చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని ఢిల్లీలో లేని రోజుల్లో మినహా మిగతా అన్ని రోజులు ఆయన పార్లమెంటుకు హాజరైన సంగతిని విపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. మోదీ అందరి కంటే ముందే సభకు వస్తున్నారని, అందరూ వెళ్లాకే తిరిగి వెళ్తున్నారని వివరించారు.

నోట్ల రద్దుపై 193 నియమం కింద చర్చకు స్పీకర్ అనుమతించినా విపక్షాలు మాత్రం అందుకు సిద్ధంగా లేవని ఆరోపించారు. ఏదో వంకతో సభను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. వారి వద్ద విషయం లేకపోవడంతోనే ఇలా మాటిమాటికి సభలో గందరగోళం సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. పెద్దనోట్ల రద్దును మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తప్పు పట్టడాన్ని వెంకయ్య తీవ్రంగా ఆక్షేపించారు. వారి ఆరోపణలు అర్థంపర్థం లేనవని కొట్టిపడేశారు. కాంగ్రెస్ హయాంలో నల్లధనంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న వెంకయ్య.. మోదీ సాహసోపేత నిర్ణయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News