: అవే క్యూలు.. అవే కష్టాలు.. పుండుమీద కారంలా వరుస సెలవులు.. ఏటీఎంలే కాదు.. బ్యాంకుల ముందూ ‘నో క్యాష్’ బోర్డులు
35 రోజుల క్రితం బ్యాంకుల ముందు మొదలైన క్యూలు నేటికీ అలాగే ఉన్నాయి. రోజులు గడుస్తుంటే తగ్గాల్సిన క్యూలు పెరుగుతుండగా ఇప్పుడు బ్యాంకుల ముందు కూడా ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జేబులో చిల్లిగవ్వలేక అల్లాడిపోతున్న సామాన్యుల పరిస్థితి రోజులు గడుస్తున్న కొద్దీ మరింత దయనీయంగా మారుతోంది. అసలే డబ్బుల్లేక అల్లాడిపోతుంటే పుండుమీద కారం చల్లినట్టుగా బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరుస సెలవుల తర్వాత మంగళవారం తెరుచుకున్న బ్యాంకుల వద్ద తుపాను బాధితుల్లా ప్రజలు గుమిగూడారు. ఉదయం 7:30 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకుని లైన్లలో నిల్చున్నారు. ‘వార్దా’ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంలో తడుస్తూనే జనాలు క్యూల్లో నిల్చోవడం గమనార్హం. ఇక పింఛన్లు తీసుకుందామని ఆశగా బ్యాంకుకు వచ్చిన లబ్ధిదారులకు బ్యాంకులు షాకిచ్చాయి. వెయ్యి రూపాయలకు చిల్లర ఇస్తే రూ.2 వేల నోటు ఇస్తామని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు తెరవడానికి గంటల ముందునుంచే ఖాతాదారులు పడిగాపులు పడితే, బ్యాంకు తెరిచిన అధికారులు నగదు లేదని, డిపాజిట్లు మాత్రమే చేసుకోవాలని చెప్పడంతో ఏపీలోని యడ్లపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆగ్రహించిన ఖాతాదారులు జాతీయ రహదారిపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఎస్సై రమేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని మేనేజర్ బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడి రూ.2వేలు చొప్పున ఇస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. కొన్నిచోట్ల క్యూలలో ఖాతాదారుల మధ్యే వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.