: యునిసెఫ్ సౌహార్ద రాయబారిగా ప్రియాంకా చోప్రా
యునిసెఫ్ సౌహార్ద రాయబారిగా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నియమితురాలైంది. యునిసెఫ్ 70వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యునిసెఫ్ నూతన రాయబారిగా ప్రియాంకా చోప్రాను నియమిస్తున్నట్టు దిగ్గజ ఫుట్ బాలర్ డేవిడ్ బెక్ హామ్, 12 ఏళ్ల బ్రిటిష్ బాల నటి మిల్లీ బాబీ బ్రౌన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ, యునిసెఫ్ తరపున బాలల సంక్షేమానికి పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపింది.
ప్రపంచంలోని అణగారిన వర్గాలకు చెందిన గొంతుగా మారాలని ప్రజలకు ప్రియాంక సూచించింది. ఆలోచించేందుకు, జీవించేందుకు వారికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కావాలని చెప్పింది. భవిష్యత్ తరాలకు ఉత్తమ జీవితాన్నిచ్చే దళంలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు. పెద్దలు అన్ని రంగాల్లో మునుపెన్నడూ లేని అభివృద్ధి సాధిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలలు హింస, దోపిడీ నుంచి రక్షణ లేని స్థితిలో ఉంటున్నారని అన్నారు.