: మనస్ఫూర్తిగా శీనన్నను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా: జగన్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు వైసీపీలో చేరారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తన అనుచరులతో కలసి వచ్చిన వెల్లంపల్లి పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి ఈ చేరికలే నిదర్శనమని చెప్పారు. శీనన్నను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పింది ఏమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అని జగన్ ప్రశ్నించారు. బాబు పాలనలో సామాన్యులు చాలా బాధలు అనుభవిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, వంగవీటీ రాధాకృష్ణలు హాజరయ్యారు.