: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం.. ఇక ఎండగడతాం: రేవంత్ రెడ్డి
ఈ నెల 16నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆమధ్య వర్షాకాల సమావేశాలు కేవలం ఐదు రోజులకే ముగిసిన నేపథ్యంలో, ఈ సమావేశాలు కూడా అలా కొన్ని రోజులే జరగకూడదని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి కోరారు. ఈ సారి సమావేశాలను కనీసం 20 రోజులపాటు నిర్వహించాలని అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో తాము త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు చెప్పారు.
తెలంగాణలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం తాము ఎల్లుండి ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలవనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను రాష్ట్ర సర్కారు ఎలా పక్కదారి మళ్లించిందో తాము చెబుతామని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా తాము రైతు సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంటుపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పారు.