చెన్నయ్ థియేటర్: సినిమా థియేటర్ లో జాతీయగీతాన్ని అవమానించిన వారిపై కేసు నమోదు
సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని అవమానించిన సంఘటనపై పోలీస్ కేసు చెన్నయ్ లో నమోదైంది. చెన్నయ్ లోని కాశీ థియేటర్ లో జాతీయ గీతం ప్రసారమవుతుండగా లేచి నిలబడని ఏడుగురు వ్యక్తులపై ఈ కేసు నమోదు చేశారు. విజయకుమార్ అనే వ్యక్తి, అతని స్నేహితులు ఈ థియేటర్ లో సినిమాకు వెళ్లారు. సినిమా ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం ప్రసారం చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలలో భాగంగా ఈ థియేటర్ లో నేషనల్ ఏంథెమ్ ప్రసారం చేశారు. అయితే, జాతీయగీతం వస్తున్న సమయంలో అవతలి సీట్లలో కూర్చున్న వారు లేచి నిలబడలేదు. దీంతో, విజయకుమార్, అతని స్నేహితులు వారిని నిలబడమని చెప్పినా వారు పట్టించుకోలేదు.
దీంతో, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో గొడవకు దారితీసింది. సినిమా విడుదలైన తర్వాత విజయ్ కుమార్ అక్కడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. దీంతో, నిందితులపై జాతీయ గౌరవ చట్టం 1971 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిలో ఒక మహిళ కూడా ఉంది. కాగా, నిందితులు చెబుతున్న కథనం మరో విధంగా ఉంది. జాతీయగీతం వస్తున్న సమయంలో తమను నిలబడాలని చెప్పిన విజయ్ కుమార్ బృందం సినిమా ఇంటర్వెల్ సమయంలో తమపై దాడి చేశారని నిందితుల్లో ఒకరైన లీనస్ రోఫన్ ఆరోపించాడు. తమపై దాడి చేసిన విజయ్ కుమార్ బృందం పై కూడా తిరిగి కేసు పెట్టామని చెప్పాడు.