: పెద్దనోట్ల రద్దుతో మమతా బెనర్జీ వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.. అందుకే ఆందోళన!: బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న మమతా బెనర్జీని జుట్టుపట్టి ఈడ్చి పారేయాల్సిందని ఆయన నోరు పారేసుకున్నారు. ఢిల్లీలో ఆమె ఆందోళన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు అందరూ తమ వాళ్లేనని, మమతను జుట్టు పట్టి లాగి పారేసి ఉండవచ్చును కానీ, తాము అలా చేయలేదని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత, వేల కోట్ల రూపాయలు నష్టపోయారని, దీంతో, ఆమె మతి భ్రమించిందని ఆరోపించారు. నోట్ల రద్దుతో పిచ్చిపట్టిన మమత, ఢిల్లీ-పాట్నా చుట్టు చక్కర్లు కొడుతోందని, చివరకు, ఆమె గంగలో దూకుతుందని తాము భావిస్తున్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మమతా బెనర్జీని ఎదుర్కోవడంలో విఫలమైన బీజేపీ, ఆమెపై వ్యక్తిగత దూషణలకు, బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.