: 15 నుంచి హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్
పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ త్వరలో ప్రారంభం కానుంది. తెలంగాణ కళాభారతి ప్రాంగణం (ఎన్టీఆర్ స్టేడియం) లో ఈ నెల 15 న ప్రారంభం కానున్న ఈ బుక్ ఫెయిర్ 26వ తేదీ వరకు కొనసాగనుంది. పన్నెండు రోజుల పాటు జరిగే ఈ బుక్ ఫెయిర్ లో వందలాది స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ప్రతి ఏటా పదిరోజుల పాటు బుక్ ఫెయిర్ నిర్వహించడం పరిపాటి. అయితే, ఈసారి మాత్రం పన్నెండు రోజుల పాటు బుక్ ఫెయిర్ నిర్వహించనుండటం విశేషం.
పెద్దనోట్ల రద్దు ప్రభావం పుస్తకాల కొనుగోలుపై పడకుండా చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి షాపులో స్వైప్ మిషన్ లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠకులు, ప్రచురణ కర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఏటీఎంలు, స్వైప్ మిషన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ, పుస్తక పఠనం పట్ల విద్యార్థుల్లో అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డు గల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుక్ ఫెయిర్ లో ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న 30వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, స్టోరీ టెల్లింగ్, పెయింటింగ్ తో పాటు సాహిత్య సదస్సులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.