: విధానసౌధలోని తన కార్యాలయంలోనే రాసలీలలు సాగించిన మంత్రి
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో మంత్రి 'నీలి' వివాదంలో ఇరుక్కున్నారు. అత్యంత పవిత్రమైన విధానసౌధలోనే రాసలీలలు జరిపారు. ఈ సిగ్గుమాలిన పనికి ఒడిగట్టింది కర్ణాటక అబ్కారీ శాఖ మంత్రి హెచ్.వై.మేటీ. వివరాల్లోకి వెళ్తే, బాగల్కోటేకు చెందిన ఓ ఉద్యోగిని తన బదిలీ విషయమై కొన్ని రోజుల క్రితం విధానసౌధలోని మేటీ కార్యాలయానికి వచ్చింది. ఆ సందర్భంగా ఆమెతో పలుమార్లు మేటీ రాసలీలలు కొనసాగించారు. ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్ మెన్ సుభాష్ రహస్యంగా చిత్రీకరించాడు.
దీంతో, మంత్రి మేటీ బండారం బట్టబయలయింది. ఈ ఉదంతంతో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. ఇటీవలే టిప్పుసుల్తాన్ జయంతి రోజున ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్... వేదికపైనే ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ మీడియా కంటపడిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా సమసిపోక ముందే మరో అభ్యంతరకర ఘటన వెలుగు చూడటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది.
మరోవైపు, మేటీని సదరు మహిళతో కలసి మాజీ గన్ మెన్ సుభాష్ బెదిరించాడు. రూ. 15 కోట్లు ఇవ్వకపోతే వీడియోలను బయటపెడతానని హెచ్చరించాడు. అయితే, రూ. 15 లక్షలు ఇస్తానని మేటీ చెప్పాడు. ఇదే సమయంలో ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్ ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను చేజిక్కించుకుని, మీడియాకు ఇవ్వడానికి యత్నించాడు. దీంతో, రాజశేఖర్ ను మంత్రి అనుచనులు బెదిరించారు. ఈ నేపథ్యంలో, బళ్లారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు.