: ద్రవిడ్! మా కోసం అప్పుడప్పుడు ఒక ట్వీట్ ఇవ్వచ్చుగా!: గంగూలీ


టీమిండియాలో ఆరోగ్యకరమైన వాతావరణంలో స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే ఆ ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ని చెప్పచ్చు. వీరిద్దరూ 1996లో లార్డ్స్‌ మైదానంలో జరిగిన టెస్టు ద్వారా అరంగేట్రం చేశారు. ఈ టెస్టులో ఒకరు శతకం బాదితే, మరొకరు 95 పరుగులతో ఆకట్టుకున్నారు. దశాబ్ద కాలం పాటు ఈ ఇద్దరూ జట్టు కోసం టన్నుల కొద్దీ పరుగులు చేశారు. దీంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అంతే కాకుండా వారిద్దరూ మంచి స్నేహితులు కూడాను. గంగూలీ రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా, బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడిగా ఆటతోపాటు, అభిమానులతో కూడా సంబంధాలు నెరపుతున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ మాత్రం అండర్ 19, ఇండియా ఏ జట్లకు కోచింగ్ ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఆడినా, ఆట నేర్పినా అందులో పూర్తిగా లీనం కావడం ద్రవిడ్ నైజం. దీంతో ద్రవిడ్ అసలు బయట ప్రపంచానికి కనిపించడం మానేశాడు. దీంతో గంగూలీ తన స్నేహితుడు కనిపించడం మానేశాడని ఆరోపించాడు. ఈ మధ్య కాలంలో రాహుల్‌ ఎక్కడ దాక్కున్నాడో తెలీదని పేర్కొన్నాడు. చాలా రోజుల్నుంచి అతడిని చూడలేదని, జూనియర్‌ క్రికెట్‌ లో బాగా లీనమైపోయాడని అన్నాడు. కనీసం టెలివిజన్‌ లో కూడా చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. రాహుల్ ఎక్కడున్నా బాగుంటాడని తెలిపాడు. తనను కూడా చాలా మంది అడుగుతున్నారని, అందుకే 'రాహుల్‌ నువ్వెక్కడున్నా అప్పుడప్పుడు ఒక ట్వీట్‌, లేదా ఫేస్ బుక్ లో ఒక పోస్టు చేసినా మాకు తెలుస్తుంది కదా' అంటూ సలహా ఇచ్చాడు. అది అభిమానులను కూడా దగ్గర చేస్తుందని సూచించాడు. దీనిపై ద్రవిడ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

  • Loading...

More Telugu News