: భాగ్యనగరానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే అది టీడీపీ వల్లే సాధ్యం!: రేవంత్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంపై టీటీడీపీ నేత రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ నేత జీవీజీ నాయుడు తమ అనుచరులతో కలిసి ఈ రోజు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రేవంత్రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు నగరాన్ని అప్పులపాలు చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్లోని పాత నగరాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీసుకుంటే, కొత్త నగరాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారని, ఇలా నగరాన్ని పంచుకుంటూ పోతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు గత ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, దాని ప్రకారమే తమ తమ అభ్యర్థుల్ని ఎన్నికల్లో పోటీకి దించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. గతంలో ముస్లిం మైనార్టీలకు కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని, ఆ హామీ అమలు చేయకుండా గడుపుతున్న కేసీఆర్ను ఎంఐఎం నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన దుయ్యబట్టారు. భాగ్యనగరానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే అది టీడీపీ వల్లే సాధ్యమని అన్నారు.