: పెద్దనోట్ల రద్దు తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం: పుదుచ్చేరి ముఖ్యమంత్రి
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల పట్ల పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అయితే, ఈ నిర్ణయానికి ముందు తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. నగదు లేక సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి వెంటనే నగదును పంపించాలని అన్నారు. వ్యాపారాలు కూడా మందకొడిగా కొనసాగుతుండడంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఒక్క ఎక్సైజ్ రంగంలోనే తమ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దనోట్ల రద్దు తరువాత 15 శాతం రెవెన్యూ లోటు వచ్చిందని నారాయణస్వామి అన్నారు. రేపటినుంచి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో ఢిల్లీలో జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో తాను పాల్గొనడానికి వెళ్తున్నానని చెప్పిన ఆయన.. అలాగే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి తమ రాష్ట్ర సమస్యలపై వివరించి చెబుతానని చెప్పారు.