: భారీగా కరెన్సీ కట్టలు పట్టుకుని, ఆపై చేతివాటం చూపిన తూర్పు గోదావరి పోలీసులు!
భారీ ఎత్తున కరెన్సీ కట్టలను పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు, నిందితులతో బేరం కుదుర్చుకుని వారిని వదిలేసి, నామమాత్రంగా ఓ కేసు నమోదు చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన సమాచారం మేరకు, తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వాడ రైల్వే గేటు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు రూ. 84.50 లక్షల పెద్ద నోట్లను తరలిస్తున్న వాహనం దొరికింది. వాహనంలో నలుగురు ఉన్నారు. వీరితో లాలూచీ పడ్డ పోలీసులు రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వాహనంలోని ముగ్గురిని వదిలేశారు. మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చేసి, రూ. 18 లక్షలు దొరికినట్టు చూపారు. డబ్బు పంపకాల వద్ద వారిలో వారికి విభేదాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సహా ముగ్గురిని విధుల నుంచి తప్పించిన ఎస్పీ, వారు నొక్కేసిన రూ. 5 లక్షలను రికవరీ చేశారు. పోలీసులు వదిలేసిన ముగ్గురు నిందితుల కోసం వెతుకుతున్నట్టు తెలిపారు.