: ఉచిత వైఫైతో 300 సినిమాలు డౌన్లోడ్ చేసిన అధికారి.. సుతిమెత్తగా హెచ్చరించిన బీహార్ సీఎం
బీహార్‌లోని సచివాలయంలో ప్రవేశపెట్టిన ఉచిత వైఫ్ సౌకర్యాన్ని ఓ అధికారి చక్కగా వినియోగించుకున్నారు. ఏకంగా 300 సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నారు. విషయం కాస్తా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో అధికారిని సుతిమెత్తగా హెచ్చరించారు. వైఫై ప్రవేశపెట్టింది సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి కాదని అన్నారు. సచివాలయంలోని ఉచిత వైఫై నుంచి ఓ అధికారి 300 సినిమాలు డౌన్లోడ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులు విజ్ఞాన, విద్యాసమాచారం తెలుసుకునేందుకు, ఆన్లైన్ పుస్తకాల కోసం మాత్రమే యూనివర్సిటీలు, కళాశాలల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నామని, అంతేకానీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి కాదని ముఖ్యమంత్రి తెలిపారు. 2017 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. యువత డిజిటల్ స్మార్ట్‌గా మారాలన్నదే తన లక్ష్యమన్న నితీశ్.. ఆ అధికారిలా విద్యార్థులు సినిమాలు డౌన్లోడ్ చేయరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.