: హైదరాబాద్‌లో బ్యాంకు ఎదుట ఖాతాదారులపై లాఠీచార్జ్.. బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ప్రజలు
పెద్దనోట్లను రద్దేచేసి నెలరోజులు పూర్తయినప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. నోట్ల రద్దుకు మద్దతు తెలుపుతున్నామని చెప్పిన ప్రజలు కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఎంతో మందికి రూ.2000 నోటు కూడా దొరకని పరిస్థితి ఏర్పడడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. హైదరాబాద్‌లోని టోలిచౌకి ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద ఈ రోజు తీవ్ర గందరగోళం నెలకొంది. బ్యాంకు ముందుకు బారీగా వచ్చిన ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఖాతాదారులు రోడ్డుపై ఉన్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వారిని అదుపు చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారు.