: ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు: జగన్
పేదలను తెలుగుదేశం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని అన్నారు. గతంలో 108 నెంబర్ కు ఫోన్ చేస్తే...కుయ్ కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ వచ్చేదని...అనారోగ్యంతో ఉన్నవారిని తీసుకెళ్లి, వారికి ఉచిత వైద్యం చేసి, ఛార్జీలకు డబ్బులిచ్చి, మందులిచ్చి ఇంటికి పంపేవారని అన్నారు. ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎప్పుడొస్తుందో తెలియదని అన్నారు. పేదలు ప్రభుత్వాసుపత్రికి వెళ్తే ఎలుకలు దాడులు చేస్తాయని, లేదా వైద్యులే ఉండరని విమర్శించారు. లేదంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఒళ్లు, ఇల్లు గుల్ల చేసుకొమ్మంటారని ఆయన ఆరోపించారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కూడా నీరుగార్చారని ఆయన విమర్శించారు.