: జయ అంత్యక్రియల్లో నవ్వుతూ సెల్ఫీ దిగిన నటుడు, ఎమ్మెల్యే.. వెల్లువెత్తిన విమర్శలు
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల్లో నటుడు, తిరువాడానై ఎమ్మెల్యే కరుణాస్ నవ్వుతూ దిగిన సెల్ఫీ ఇప్పుడు వివాదాస్పదమైంది. సమాధి వద్ద రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా నివాళి అర్పిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కరుణాస్ వద్దకు వచ్చిన ఓ అభిమాని సెల్ఫీ దిగుదామని ఆయనను కోరడంతో... కాదనలేక ఆయన ఓకే చెప్పారు. అంతేకాదు, అభిమానితో కలసి నవ్వుతూ సెల్ఫీకి పోజిచ్చారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జయ మరణంతో అందరూ దు:ఖంలో ఉన్న సమయంలో... కరుణాస్ ఈ విధంగా నవ్వుతూ సెల్ఫీలకు పోజివ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కరుణాస్ స్పందించారు. రాజాజీ హాల్ వద్ద, ఎంజీఆర్ స్మారక మందిరం వద్ద కూడా తనతో సెల్ఫీ దిగేందుకు పలువురు యత్నించారని... అయితే, వారందరినీ తాను తిట్టి పంపించానని చెప్పారు. ఇదే విధంగా ఓ యువకుడు గ్రామం నుంచి వచ్చానని... సెల్ఫీ దిగుతానని బతిమాలాడని... దీంతో అతనితో కలసి ఫొటో దిగానని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో ప్రజలకు తెలియదన్నారు. అమ్మపై తనకు ఎంత విశ్వాసం ఉందో ఆమెకు కూడా తెలుసని... అమ్మ సమాధి వద్ద నుంచి పిడికెడు మట్టిని తెచ్చుకుని తన ఇంట్లో భద్రపరుచుకున్నానని తెలిపారు.