: ఇక్కడ నేనే బాస్ అని డాక్టర్ రిచర్డ్ బాలే చెబితే... 'ఈ రాష్ట్రం నా అడ్డా' అన్నట్టు జయ సైగ చేశారట!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ తో సెప్టెంబర్ 22వ తేదీన ఆమెను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చారు. అప్పటికి ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉండటంతో... లేచి కూర్కొని శాండ్ విచ్ లు, కాఫీ తీసుకునేవారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అనారోగ్యంతో పోరాడుతూ ఆమె క్రమంగా బలహీనపడ్డారు. బాగా నీరసంగా ఉన్నప్పుడు కూడా డ్యూటీ డాక్టర్లతో, నర్సులతో ఆమె మాట్లాడేవారట. ఎంత బీజీగా ఉన్నా... మహిళలు తమ మీద తాము కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలని జయ సూచించేవారట. అంతేకాదు, మాట్లాడలేని స్థితిలో ఉన్న సమయాల్లో కూడా తన రాజసాన్ని ఆమె ఏమాత్రం వదులుకోలేదట. అపోలో ఆసుపత్రిలో ఇస్తున్న కాఫీ, టీలు జయలలితకు ఏమాత్రం నచ్చేవి కాదట. ఓ రోజు డాక్టర్లు, నర్సులను అందరినీ పిలిచి... "ఒక రోజు మీరంతా పోయస్ గార్డెన్ కు రండి... కొడైనాడు నుంచి తెప్పించిన బెస్ట్ టీ ఇప్పిస్తాను" అని చెప్పారట. 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమె చాలా సరదాగా ఉంటూ, చికిత్సకు బాగా సహకరించేవారట. కానీ, అప్పుడప్పుడు మాత్రం కొంచెం బాధగా ఉండేవారని ఆమెకు వైద్యం చేసిన వైద్యులు, నర్సులు తెలిపారు. మూడు షిఫ్టుల్లో 16 మంది నర్సులు ఆమెకు సేవలందించేవారట. ఆసుపత్రి నుంచి విడుదలయ్యాక ఏం చేయాలన్న విషయాలను కూడా జయ ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారట. అంతేకాదు... "నేను ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పింది చేస్తా" అని చాలా సందర్భాల్లో చెప్పారని ఆమెకు వైద్య సేవలు చేసిన నర్సు షీలా తెలిపారు. తాము ఆమె వద్దకు వెళ్లినప్పుడు నవ్వేవారని... తమతో మాట్లాడేవారని షీలా చెప్పారు. తనను అసెంబ్లీకి కూడా తీసుకెళ్తానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. నవంబర్ 22వ తేదీన జరిగిన ఉపఎన్నికల్లో తంజావూరు, అర్వకురుచ్చి, తిరుపరంకుంద్రమ్ స్థానాల్లో అన్నాడీఎంకే గెలిచిన విషయాన్ని టీవీలో చూపి, చిన్నగా నవ్వారని డాక్టర్ సత్యభామ చెప్పారు. ఆమెకు వైద్యం చేయడానికి లండన్ నుంచి ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ రిచర్డ్ బాలే వచ్చిన సంగతి తెలిసిందే. ఓసారి ఆయన తనకు సహకరించాలని గట్టిగా చెబుతూ, ఆసుపత్రిలో తానే 'బాస్'నని జయతో అన్నారట... దీనికి సమాధానంగా, ఎంతో నీరసంలో వుండి కూడా, 'ఈ రాష్ట్రం మొత్తం నా అడ్డా' అన్నట్టు జయ సైగ చేశారట. ఇలాంటి పరిస్థితిలో, గత ఆదివారం సాయంత్రం పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. గదిలోని టీవీలో ఆమె ఓ పాత తమిళ నాటకాన్ని చూస్తున్నప్పుడు ఓ ఇంటెన్సివిస్ట్ ఆమె గదిలోకి వెళ్లారు. అయితే, అంతకుముందులా జయ నవ్వలేదు. మాట్లాడలేదు. జయకు శ్వాస అందడం కష్టమవుతున్నట్టు అర్థమయింది. వెంటిలేటర్ సరిచేసేసరికే... చుట్టూ ఉన్న మానిటర్లన్నింటిలోని గీతలు అడ్డంగా, సరళరేఖల్లా వచ్చేశాయి. అంటే, ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారన్నమాట. సోమవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో అమ్మ తుదిశ్వాస విడిచారంటూ ప్రకటన వెలువడింది.

  • Loading...

More Telugu News