: ప్రపంచంలో సురక్షితమైన నగరాలివే!


ప్రపంచం పట్టణాల దిశగా పరుగులు పెడుతోంది. వ్యాపారం, పెట్టుబడులు, పర్యటనలకు, ఉద్యోగాలు, ఉపాధి, స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా సరే ప్రపంచం మొత్తం పట్టణాలవైపు పరుగులు తీస్తోంది. అయితే ఈ పట్టణాలు సురక్షితమైనవేనా? అంటే సమాధానం మాత్రం కరవవుతోంది. ఈ నేఫథ్యంలో సురక్షిత జీవనానికి అనువైన నగరాల జాబితాను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న టాప్ నగరాల వివరాల్లోకి వెళ్తే... * టోక్యో (85.63): ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఉన్న టోక్యో ఈ జాబితాలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. లివింగ్ కాస్ట్ మరీ అంత చౌక కాకపోయినా రక్షణ విషయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలు టాప్ జాబితాలో చోటు దక్కేలా చేశాయి. * సింగపూర్ (84.61): వ్యక్తిగత భద్రత, బిజినెస్ ఎన్విరాన్మెంట్లో టాప్లో నిలిచిన సింగపూర్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అగ్రస్థానాన్ని మాత్రం తృటిలో చేజార్చుకుంది. * ఒసాకా (82.36): వ్యక్తిగత భద్రత విషయంలో జపాన్కు చెందిన ఒసాకా నగరం రెండో స్థానంలో నిలిచి, సైబర్ సేఫ్టీ విషయంలో మాత్రం ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఇది మూడో స్థానంలో నిలిచింది * స్టాక్ హోమ్(80.02): సైబర్ సేఫ్టీలో యూరోపియన్కు చెందిన నగరాల్లో టాప్ జాబితాలో చోటు దక్కిన ఏకైక నగరంగా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నిలిచింది. ఇది నాలుగో స్టానంలో నిలవడం విశేషం. * ఆమ్ స్టర్ డ్యాం (79.19): తక్కువ జనాభా ఉండి, చిన్న నగరంగా ఉన్న అత్యుత్తమ రక్షణ చర్యలతో టాప్ నగరాల జాబితాలో ఐదో స్థానంలో చోటు సంపాదించింది. * సిడ్నీ (78.91): మౌలిక రక్షణలో టాప్ స్థానంలో నిలిచి పటిష్టమైన రవాణా వ్యవస్థలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది సిడ్నీ నగరం. ఆస్ట్రేలియాకే చెందిన మరో నగరం మెల్బోర్న్ కన్నా ఉన్నతంగా ఆరో స్థానంలో నిలవడం విశేషం. * జ్యురిచ్ (78.81): మౌలిక భద్రత, ఆరోగ్య రక్షణ అంశాల్లో అత్యుత్తమ పద్ధతులతో మేటినగరంగా దూసుకుపోతోంది ఈ స్విస్ నగరం. ఈ రెండు అంశాల్లో ముందంజలో ఉన్న జ్యురిచ్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఏడో స్థానానికి పరిమితమైంది. * టోరొంటో (78.81): కాస్ట్ ఆఫ్ లివింగ్, బిజినెస్ ఎన్విరాన్ మెంట్ అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే నివసించడానికి అత్యుత్తమ నగరాల జాబితాలో ఈ నగరం టాప్ లో నిలుస్తోంది. అయితే అన్ని అంశాలను లెక్కలోకి తీసుకుంటే ఎనిమిదో స్థానంలో వుంది. * మెల్బోర్న్ (78.67): మౌలిక భద్రత విషయంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ రోడ్డు, రైలు ప్రమాదాలు అరికట్టడంలో ముందుంటోంది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం. దీంతో ఇది తొమ్మిదో సురక్షిత నగరంగా నిలిచింది. * న్యూయార్క్ (78.06): ఆరోగ్య రక్షణ విషయంలో అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ రెండో స్థానంలో నిలిచింది. వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన కార్యచరణతో రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకుంటూ మిగతా నగరాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే ఇతర సౌకర్యాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పదో స్థానంలో నిలిచింది. * హాంగ్ కాంగ్ (77.24): సైబర్ సేఫ్టీలో ప్రపంచంలోనే టాప్ ఐదు స్థానాల్లో హాంకాంగ్ కు చోటు దక్కింది. ఇది అన్ని అంశాల్లోను టాప్ జాబితాలో హాంకాంగ్ కు చోటుదక్కడానికి ముఖ్యకారణంగా నిలిచింది. దీంతో ఇది పదకొండో స్ధానంలో నిలిచి సత్తాచాటింది. * శాన్ ఫ్రాన్సిస్కో (76.63): వలసల నియంత్రణను అరికడుతూ, వాతావరణ మార్పులను పరిశీలిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో జనసాంద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించేలా నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 2014లో ఛీఫ్ రెసిలెన్స్ అధికారిని నియమించారు. దీంతో ఇది అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అలా ఇది పన్నెండో స్థానంలో నిలిచింది. * తైపీ (76.51): సురక్షిత నగరాల జాబితాలో 13వ స్థానంలో ఉన్నా, వ్యక్తిగత భద్రత అంశంలో మాత్రం తైపీ 4వ స్థానంలో నిలిచింది. * మాంట్రియల్ (75): ఈఐయూ తెలిపిన వివరాల ప్రకారం...కెనడాలోని మాంట్రియల్ నగరం ప్రపంచంలోనే బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో నాలుగో స్థానం, ఆహార భద్రతలో 8వ ర్యాంకు పొందింది. దీంతో మాంట్రియల్ నగరానికి సురక్షిత మైన నగరాల జాబితాలో 14వ స్థానం దక్కింది. * బార్సిలోనా (75): సబ్ వేలు, వీధుల్లో పోలీసుల గస్తీ ఎక్కువగా ఉండాలని మూడేళ్ల కిందట బార్సిలోనా నగర కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో క్రైం శాతం 32 శాతం దిగొచ్చింది. ఇలా సురక్షిత నగరాల జాబితాలో 15వ స్థానంలో నిలిచింది. ఈ నగరాల్లో జీవనం సురక్షితమని ఈఐయూ తెలిపింది. కాగా, ఈ టాప్ నగరాల జాబితాలో భారత్ కు చెందిన ఒక్క నగరం కూడా స్థానం సంపాదించలేకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News