: బిచ్చమెత్తుకునే నేను.. ‘అమ్మ’ వల్లే న్యాయవాదిని అయ్యాను: కర్ణాటక యువతి
జయలలిత మరణం ఆమె అభిమానులను ఎంతగానో కుంగదీసింది. ఆమె సాయం పొంది జీవితంలో పైకొచ్చిన వారిదీ అదే పరిస్థితి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాగరత్న అనే ముప్ఫై రెండు సంవత్సరాల యువతి చెప్పిన మాటలు వింటే ‘అమ్మ’ దయాగుణం ఏపాటిదో అర్థమవుతుంది. ‘మైసూరు వీధుల్లో బిచ్చమెత్తుకునే నేను ‘అమ్మ’ దయ వల్లే చదువుకున్నాను..న్యాయవాదిని అయ్యాను. అమ్మను కలిసి నా కృతజ్ఞతలు చెప్పుకుందామనే లోపే ఈ విషాదం జరిగిపోయింది’ అంటూ నాగరత్న కన్నీరు మున్నీరవుతోంది. ప్రస్తుతం బెంగళూరు సివిల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆమె తన గత జీవితం, బిచ్చమెత్తుకుని కొన్ని తరగతుల వరకు చదువుకున్న తీరు, ఆ తర్వాత జయలలిత ఏ విధంగా సాయం అందించిందనే విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ వివరాలు.. నాగరత్న కుటంబం బిచ్చమెత్తుకుని జీవించేది. మైసూరులోని ప్రభ థియేటర్ పక్కన ఉండే వీధుల్లోనే తలదాచుకునేవాళ్లు. అయితే, ఇతర బిచ్చగాళ్ల మాదిరిగా కాకుండా, నాగరత్నకు చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుతో చదువుకునేది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విక్టోరియా పాఠశాలలో, 9, 10వ తరగతులు సెయింట్ ఆంటోని పాఠశాలలో చదువుకుంది. ఆమె గురించి మీడియాలో రావడంతో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దృష్టికి ఇది వెళ్లింది. దాంతో, ఒకరోజు ఆమె తన సెక్రటరీ పొగలేదిని మైసూర్ కు పంపించి, నాగరత్నను చెన్నైకు తీసుకురావాలని పురమాయించారు. 2001లో లక్ష రూపాయల చెక్ ను నాగరత్నకు ఇచ్చిన జయలలిత, ఆ మొత్తాన్ని చదువుకు ఖర్చు పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఏదైనా అవసరమైతే తాను సాయం చేస్తానని నాగరత్నకు జయలలిత చెప్పారు. ఈ సందర్భంగా, జయలలిత తనతో మాట్లాడిన మాటలను నాగరత్న గుర్తుచేసుకుంటూ ‘‘అప్పుడు అమ్మ పదిహేను నిమిషాల పాటు నాతో గడిపారు. ‘కన్నడ లేక తమిళ్ ఏ భాష నీకు బాగా వచ్చు?’ అని జయలలిత నన్ను ప్రశ్నించారు. ‘నాకు తమిళ్ కూడా తెలుసు’ అని నేను సమాధానమిచ్చాను. జయలలిత లక్ష రూపాయలు ఇచ్చి, ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోవాలని.. దానిపై వచ్చే వడ్డీతో నాకు ఆసక్తి ఉన్న కోర్సును చదువుకోవాలని చెప్పారు. జయలలిత ఇచ్చిన డబ్బును బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయగా వచ్చిన వడ్డీ డబ్బులతో పీపుల్స్ పార్క్ కళాశాలలో పీయూసీ, ఆ తర్వాత మైసూరులోని మహాజన్ లా కళాశాలలో ఎల్ఎల్ బీ పూర్తి చేశాను. ఎల్ఎల్ బీ పూర్తయిన తర్వాత అడ్వకేట్ గా ఎన్ రోల్ చేసుకోవడానికి ముందు, ఎస్ఐసీహెచ్ఆర్ఈఎం అనే ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేశాను. ఆనాడు నా చదువు కోసం జయలలిత ఇచ్చిన ఆ లక్ష రూపాయల మొత్తాన్ని ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్న నా కూతురు చదువు కోసం ఆమె పేరు మీద డిపాజిట్ చేశాను. నేను లాయర్ అయిన తర్వాత ‘అమ్మ’ను కలవాలని పలుమార్లు ప్రయత్నించాను. కానీ, కలవలేకపోయాను. ఇంతలో అమ్మ ఈ ప్రపంచం నుంచే వెళ్లిపోయింది. నాకు విద్యాదానం చేసిన మహనీయురాలు ఆమె’ అంటూ ఆవేదన్ వ్యక్తం చేసింది 32 సంవత్సరాల నాగరత్న.