: పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్య‌మో, భూములు కోల్పోయిన వారిని ఆదుకోవ‌డం కూడా అంతే ముఖ్యం: వైఎస్ జ‌గ‌న్


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు తూర్పుగోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డి స్థానికుల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఓ వ్య‌క్తి మాట్లాడుతూ పోలవరం ప్రాజక్టు వల్ల త‌మ భూముల‌ను కోల్పోతున్నామ‌ని, ప‌రిహారం కూడా స‌రిగా ఇవ్వ‌డంలేద‌ని, మ‌రోవైపు ఒక్కొక్క‌రికీ ఒక్కో ప్యాకేజీ ఇస్తున్నార‌ని; తమకు, గిరిజ‌నులకు మ‌ధ్య గొడ‌వ‌లు పెడుతున్నార‌ని జగన్ కి చెప్పాడు. దీనిపై జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌చ్చి మూడేళ్లు కావ‌స్తోందని, అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లకు చేసింది ఏమీ లేద‌ని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అందరికీ కావాలని అన్నారు. అయితే, పోల‌వ‌రం ఎంత ముఖ్య‌మో, భూములు కోల్పోయిన వారిని ఆదుకోవ‌డం కూడా అంతే ముఖ్య‌మని పేర్కొన్నారు. నిర్వాసితుల‌ను ప్ర‌భుత్వం పట్టించుకోవ‌డం లేదని జగన్ చెప్పారు. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్న గిరిజ‌నుల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడికి కాంట్రాక్ట‌ర్ల మీద ఉన్న ధ్యాస నిర్వాసితుల‌ను ఆదుకోవ‌డంలో లేద‌ని అన్నారు. ప్ర‌భుత్వం భూమికి భూమి ఇస్తామ‌ని చెప్పింద‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సెంటు కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. చ‌ట్టం ప్ర‌కారం ప్రాజెక్టు ప‌రిధిలోనే నిర్వాసితుల‌కు భూములివ్వాల‌ని డిమాండ్ చేశారు. ప‌ట్టిసీమ‌లో నిర్వాసితుల‌కు ఎక‌రాకు రూ.19 ల‌క్ష‌లు ఇచ్చార‌ని, ఇక్క‌డ మాత్రం రూ. ల‌క్ష కూడా ఇవ్వ‌లేద‌ని గిరిజనులు చెబుతున్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. గిరిజ‌నుల భూముల‌ను దౌర్జ‌న్యంగా లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News