: ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ‘అమ్మ’ సమాధి వద్దకే వెళ్లి నివాళులర్పించిన నటుడు అజిత్
దివంగత సీఎం జయలలితకు తమిళనటుడు అజిత్ నివాళులర్పించాడు. జయలలిత గుండెపోటుతో మరణించిన వార్త వెలువడిన సమయంలో అజిత్ భారత్ లో లేడు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తమిళ సినిమా షూటింగ్ నిమిత్తం బల్గేరియాలో ఉన్నాడు. జయలలిత మృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే తన షూటింగ్ ను రద్దు చేసుకున్న అజిత్, హుటాహుటిన ఇక్కడికి బయలుదేరారు. నిన్న అర్ధరాత్రి చెన్నైకు చేరుకున్న అజిత్, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లాడు. అజిత్ తన భార్య షాలినితో కలిసి అక్కడికి వెళ్లి నివాళులర్పించాడు. కాగా, అజిత్ ను జయలలిత తన కొడుకుగా భావిస్తుందనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె వారసుడిగా అన్నాడీఎంకే పార్టీలో ఆయన చేరే అవకాశముందని, భవిష్యత్తు రాజకీయాల్లోకి అజిత్ రావొచ్చని సంబంధిత వర్గాల సమాచారం.