: మీకు ప్రాణ హాని ఉందని చెపితే జయ నవ్వేశారు: వీరప్పన్ ను అంతం చేసిన పోలీసధికారి
ప్రజలకు జయలలిత ఎంత అంకితభావంతో సేవ చేశారో ఈ ఉందంతం చూస్తే అర్థమవుతుంది. కిల్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్... జయలలితకు ప్రత్యేక భద్రత అధికారిగా కూడా పని చేశారు. ఆ సమయంలో జరిగిన ఓ ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. మీకు ప్రాణ హాని ఉందని... మీ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని... మీరు పర్యటనలు తగ్గించుకోవాలని జయకు తాను సూచించానని... దీంతో ఆమె నవ్వేశారని ఆయన చెప్పారు. 'ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడం నా బాధ్యత... నన్ను కాపాడటం మీ బాధ్యత' అంటూ ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారని విజయ్ తెలిపారు. అయితే, అన్నివిధాలుగా మీకు సహకరిస్తానని ఆమె చెప్పారట. ప్రజల కోసం జయలలిత ఎంతగా తపించిపోయేవారో ఈ మాటలే చెబుతాయని ఆయన అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.