: కొడుకు పుడితే ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు?... యాంకర్ ప్రశ్నకు సానియా మీర్జా తెలివైన సమాధానం!
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జీ టీవీ నిర్వహించే 'యాదోంకీ బారాత్' కార్యక్రమంలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో కలసి సానియా మీర్జా పాల్గొన్న వేళ, కార్యక్రమం హోస్ట్, బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్, సానియాకు ఊహించని ప్రశ్నను సంధించాడు. "ప్రతి భారత, పాకిస్థాన్ పౌరుల తరఫున ఈ ప్రశ్నను అడుగుతున్నాను. మీకు వివాహమై ఆరేళ్లు గడుస్తోంది. ఇక ఇప్పుడు మీకు భగవంతుడు పిల్లలను ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నా. మీకు, షోయబ్ మాలిక్ కు కుమారుడు పుట్టి, ఆటగాడైతే, ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు?" అని అడిగాడు. ఇక దీనికి సానియా ఏ మాత్రమూ తొణకకుండా దిమ్మతిరిగే సమాధానాన్నే ఇచ్చింది. "నిజాయతీగా చెబుతున్నాను. ఈ విషయాన్ని గురించి మేము ఎన్నడూ చర్చించలేదు. మాకు తెలియదు కూడా. మా బిడ్డ ఆటగాడే ఎందుకు కావాలి? నటుడు కావచ్చు. టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. ఇది చాలా దూరంలో ఉన్న విషయం. భారతీయురాలినైనందుకు నేనెంతో గర్విస్తున్నాను. పాకిస్థానీ అయినందుకు అతనూ అంతే. మేమిద్దరమూ కలిస్తే, భార్యాభర్తలమైనందుకు ఇంకా ఎంతో గర్విస్తుంటాము" అని సానియా సమాధానం ఇచ్చింది.