: నోట్ల రద్దుపై భారత్‌ను ఆక్షేపించిన రష్యా.. కేంద్రానికి లేఖ
పెద్ద నోట్ల రద్దుపై ఇప్పటి వరకు భారత్‌లోనే వినిపించిన నిరసనలు ఇప్పుడు విదేశాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. నోట్ల రద్దుపై రష్యా తన నిరసనను వ్యక్తం చేసింది. పెద్ద నోట్లు రద్దు చేయడం, కొత్తనోట్లు అందుబాటులో లేకపోవడంతో రాయబార కార్యాలయ నిర్వహణ కష్టమవుతోందని పేర్కొంది. సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ రష్యా రాయబారి అలెగ్జాండర్ కడాకిన్ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. సమస్య పరిష్కారం కోసం విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని అందులో కోరారు. అలాగే దౌత్యకార్యాలయ సిబ్బంది నగదు ఉపసంహరణపై పరిమితి లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో విదేశాంగశాఖ నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుందని రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. భారత్ చర్యతో ఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న 200 మంది సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించకపోతే మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలోని సిబ్బందికి కూడా నగదు ఉపసంహరణపై పరిమితి విధిస్తామని హెచ్చరించారు.