: అన్నాడీఎంకేలోకి శశికళ భర్త నటరాజన్?
అన్నాడీఎంకేకు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సోమవారం ఆయన జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకుని అంజలి ఘటించడం ఇందుకు బలం చేకూరుస్తోందని చెబుతున్నారు. జయలలితకు శశికళ ఆప్తురాలిగా మారాక ఐఆర్ఎస్ అధికారి అయిన ఆమె భర్త నటరాజన్ ప్రభుత్వంలో, పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేవారు. అయితే ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న జయ అతడిని దూరంగా పెట్టారు. ఒకానొక సమయంలో శశికళను కూడా ఇంటి నుంచి పంపించి వేశారు. అయితే కుటుంబ సభ్యులతో ఆమె సంబంధాలు వదులుకున్నాక తిరిగి శశికళను ఇంట్లోకి రానిచ్చారు. ఇన్నాళ్లూ జయకు దూరంగా ఉన్న నటరాజన్ సోమవారం పోయెస్ గార్డెన్‌కు వచ్చారు. మంగళవారం రాజాజీహాల్‌కు వచ్చి జయకు నివాళి అర్పించారు. అంత్యక్రియలకూ హాజరయ్యారు. దీంతో పార్టీలోకి ఆయన పున:ప్రవేశం జరిగినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జయ మృతి తర్వాత ముఖ్యమంత్రి ఎంపికలో కీలకంగా వ్యవహరించిన శశికళ.. ఇప్పుడు భర్తతో కలిసి చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.