: వేర్పాటువాద హురియత్ నేతలకు మద్దతు ప్రకటించిన ఫరూఖ్ అబ్దుల్లా
గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మరోసారి అదే తీరు కనబరిచారు. వేర్పాటువాద సంస్థ హురియత్ నేతలు కశ్మీరు కోసం సమైక్యంగా పోరాడాలని, ఈ పోరాటానికి తాము అండగా నిలబడతామని మద్దతు పలికారు. ఫరూఖ్ అబ్దుల్లా తండ్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా 111వ జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ సమయంలో తాము హురియత్ పక్షాన నిలబడుతున్నామని అన్నారు. తమను శత్రువులుగా భావించవద్దని, తాము శత్రువులం కాదని తెలిపారు. సమైక్యంగా ఉండిపోరాడాలని హురియత్ నేతలను కోరుతున్నానని ఆయన సూచించారు. నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు కశ్మీర్ పోరాటంలో వెనుకబడి ఉండవద్దని కోరారు. హురియత్ నేతలు దారి మళ్లనంతవరకు తాను వారి వెన్నంటి ఉంటానని అన్నారు. ఇంతకు ముందు పోరాడామని, ఇప్పుడు కూడా పోరాడుదామని, దీని కోసం తమ జీవితాలను వృథా చేసుకున్నామని అన్నారు. పవిత్ర స్థలం నుంచి హురియత్ నేతలకు మద్దతునిస్తున్నానని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన భారత్-పాకిస్థాన్ దేశాలు కశ్మీరీలపై ఆధిపత్యం కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు దేశాల పప్పులుడకవని, ఏదో ఒకరోజు ఈ సమస్యను పరిష్కరించాల్సిందేనని ఆయన తెలిపారు.