: ఆరోజు జయలలితకు ఎన్టీఆర్ పాడిన పద్యం గుర్తుకు వచ్చిందట!
చిన్నప్పటి నుంచి పుస్తకపఠనం అలవాటుగా ఉన్న జయలలితకు ముఖ్యంగా ఇతిహాసాలు, పురాణగాధలు చదవడం అంటే ఎంతో ఇష్టం. ఖాళీగా ఉన్న సమయంలోను, ప్రయాణాలలోను.. ఇలా సమయం దొరికినప్పుడల్లా జయలలిత పుస్తకాలు చదువుతుండేవారు. కేవలం, వాటిని చదవడమే కాదు, ఆయా పురాణగాథలలోని సన్నివేశాలను తన నిజజీవితానికి ఆమె అన్వయించుకునేవారు. ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే సభ్యులు తనను పరాభవించిన సంఘటనను.. మహాభారతంలోని ఒక సన్నివేశంతో ఆమె పోల్చుకున్నారు. అది కూడా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు ఈ సన్నివేశానికి సంబంధించి ఆయనే స్వయంగా జయలలితకు వినిపించిన పద్యం అది. తమిళ అసెంబ్లీలో జయలలిత డీఎంకే కార్యకర్తల చేతిలో నాడు జరిగిన పరాభవం, అవమానం ఆమెను ఎంత ఆవేదనకు గురిచేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1989 మార్చి 25 న జయలలిత జుట్టు, చీర పట్టుకుని లాగిన డీఎంకే కార్యకర్తలు, చేతికి అందిన వస్తువులను ఆమెపై విసిరివేశారు. గాయాలతో, చిరిగిన చీరతో, చెదిరిన జుట్టుతో.. తీవ్ర ఆవేదనతో ఉన్న జయ కాళిక కళ్లతో అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ.. ‘ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి మళ్లీ అడుగుపెడతా’నంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన సంఘటన ఎవరూ మరవలేరు. అయితే.. భీషణ ప్రతిజ్ఞ చేసి తన నివాసానికి వెళ్లిన జయకు ఆ నాటి రాత్రి, గతంలో ఎన్టీఆర్ పాడివినిపించిన పద్యం గుర్తొచ్చిందట. ఈ విషయాన్ని జయలలితే స్వయంగా ఒక సందర్భంలో చెప్పారు. ‘ఎన్టీఆర్ గారితో సినిమా చేసినప్పుడు కొంచెం ఫ్రీటైమ్ దొరికన సందర్భంలో తెలుగు నుడికారం, సాహిత్యం గురించి ఆయన చెబుతుండేవారు. నిండుసభలో ‘ద్రౌపది వస్త్రాపహరణ’ సన్నివేశం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. తనకు భీముడి పాత్ర ఎందుకు ఇష్టం అనే విషయాన్ని చెప్పారు. కళ్ల ముందు అన్యాయం జరిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించిన భీముడు ప్రతిజ్ఞ చేశాడని చెబుతూ.. ‘కురువృద్ధులు గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండ.. ద్రౌపదినిట్లు చేసిన ఖలున్’ అంటూ ఒక పద్యం చెప్పారు. ఆ పద్యమే నాకు గుర్తొచ్చింది’ అని జయలలిత నాడు చెప్పారు. డీఎంకే కార్యకర్తలు తనను అవమానించినప్పుడు.. భీముడిలో ఉన్న ఆవేశమే తనలో కూడా వచ్చిందని.. ఆ ఆవేశాన్ని నియంత్రించుకున్నానని, తనను అవమానించిన వారిని పదవి నుంచి తొలగించేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లానని జయలలిత నాడు పేర్కొన్నారు.