: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు.. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పరారీ
తల్లిదండ్రుల తరువాత పిల్లలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులకే ఉందంటారు. కానీ, కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తోన్న తీరును చూస్తోంటే తల్లిదండ్రులు పాఠశాలలకు తమ పిల్లలను పంపాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరులోని ఏపీ మోడల్ పాఠశాలలో కలకలం రేపింది. సైన్స్ ఉపాధ్యాయుడు విద్యాసాగర్ కామాంధుడిలా మారి తన తరగతి గదిలోని విద్యార్థినులను ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతడిపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో స్థానికులు అతడికి బుద్ధిచెప్పినప్పటికీ మళ్లీ ఇప్పుడు అటువంటి ఘటనలకే పాల్పడుతున్నాడు. అతడి నుంచి వేధింపులు అధికమయ్యాయని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ కామాంధుడి వికృత చేష్టలు బయటపడ్డాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు అంతా కలిసి ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు విద్యాసాగర్ కనిపించకుండా పారిపోయాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు విద్యార్థులతో కలిసి స్కూలు ఎదుట ఆందోళనకు దిగి, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.