: రద్దైన నోట్లను జమ చేసే గడువును కనీసం మరో ఆరునెలలు పొడిగించాలి: ప్రవాస భారతీయుల విజ్ఞప్తి


పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై అమెరికాలోని ‘ద గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’(జీవోపీఐవో) స్పందించింది. భారత ప్ర‌భుత్వం ఎంతో గొప్ప‌నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొంది. అయితే, పాత‌నోట్ల‌ను డిపాజిట్ చేసేందుకు ఈనెల 30తో గ‌డువు ముగుస్తుండ‌డంతో ఆ గ‌డువును మ‌రింత పెంచాల‌ని కోరింది. ఈ మేర‌కు భార‌త ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి ఓ లేఖ‌ను రాసింది. రద్దయిన నోట్లను బ్యాంకులో జమ చేయాలంటే ఎన్‌ఆర్‌ఐలు, భారత సంతతికి చెందిన వారు ప‌లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నార‌ని పేర్కొంది. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డానికి కొన్ని రోజుల ముందు భారత్‌కి వచ్చిన కొంద‌రు ఎన్‌ఆర్‌ఐలు తమ తదుపరి పర్యటన కోసం రూ.500, రూ.1000 నోట్లను ప‌లు బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపరుచుకున్నారని, ఈ క్ర‌మంలో వారు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపింది. మ‌రోవైపు స్వదేశానికి వెళ్లేందుకు ఆయా దేశాలు అనుమతులు ఇవ్వడం కూడా క్లిష్టంగా ఉందని చెప్పింది. వారి ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకొని పెద్దనోట్లను జ‌మ చేసుకునేందుకు గ‌డువును మ‌రో ఆరునెల‌ల వ‌ర‌కు పెంచాల‌ని కోరింది.

  • Loading...

More Telugu News