: రజనీకాంత్ కు కోపమొచ్చింది.. జయలలిత కాన్వాయ్ జామ్ అయింది... నాటి ఆసక్తికర ఘటన!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సూపర్ స్టార్ రజనీకాంత్... కొంతకాలం పాటు విభేదాలు, కొంతకాలం సయోధ్య.. ఇలా సాగుతూ వచ్చింది వీరిద్దరి మధ్య బంధం. ఇక గాయత్రీ శ్రీకాంత అనే నేత్ర వైద్య నిపుణురాలు ‘ద నేమ్ ఈజ్ రజనీకాంత్’ అనే పుస్తకంలో వీరిద్దరికీ సంబంధించిన ఆసక్తికర ఘటనను ఒకదాన్ని వివరించారు. రజనీకాంత్ కోపం, ముఖ్యమంత్రి జయలలిత కాన్వాయ్ నే ఆపేసిందని తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే... ఒక రోజు రజనీకాంత్ కారులో ప్రయాణిస్తుండగా జయలలిత కాన్వాయ్ ఆ దారిన వెళ్లాల్సి వుండటంతో ట్రాఫిక్ ను నిలిపివేశారు. ట్రాఫిక్ ఎందుకు ఆగిందని రజనీకాంత్ ప్రశ్నించగా, సీఎం ఆ దారిలో రానున్నారని, అందువల్ల ట్రాఫిక్ ఆపామని ఓ ట్రాఫిక్ పోలీస్ చెప్పాడు. ఇక జయలలిత ఎంతసేపట్లో వస్తారు? అన్న ప్రశ్నకు సమాధానం అతని వద్ద లేదు. ట్రాఫిక్ ను వదలవచ్చుగా? అని అడిగితే, కుదరదన్నాడు. దీంతో రజనీకాంత్ కు కోపం వచ్చింది. ఒక్క సెకను తరువాత, రజనీ కారు దిగి, దగ్గర్లోని బడ్డీకొట్టు వరకూ నడుస్తూ వెళ్లి, ఓ సిగరెట్ కొని పక్కనే నిలబడి దాన్ని తాగడం ప్రారంభించాడు. ఇంకేముంది, క్షణాల్లో వందలు, వేల మంది ఆయన చుట్టూ చేరిపోయారు. ఆపై ఏం జరిగివుంటుందో తెలిసిందా? ఆ దారిలో వస్తున్న జయలలిత కాన్వాయ్ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకే గంటన్నరకు పైగా పట్టిందట. మరి రజనీ సార్ కోపమా? మజాకా?