: గిన్నిస్ రికార్డులకెక్కిన జయలలిత దత్తపుత్రుడి వివాహం.. ఆ తర్వాతే అక్రమాస్తుల కేసు
జయలలిత జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఒంటరి జీవితం ఆమెను బాధించేది. అదే సమయంలో శశికళ పరిచయంతో ఒంటరితనం నుంచి జయ దూరమయ్యారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి మొత్తం ప్రపంచం దృష్టినే ఆకర్షించారు. భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి వేసి చేసిన పెళ్లి ఏకంగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. చెన్నై నగరంలో 50 ఎకరాల సువిశాల మైదానంలో లక్షన్నర మంది అతిథులకు విందు ఏర్పాటు చేసి తానేంటో ప్రపంచానికి తెలియజేశారు. అతిపెద్ద వివాహ విందుగా ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వివాహ ఆహ్వాన పత్రికకు బంగారు పూత పూయించిన జయ తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి వివాహ వేదిక వరకు కొన్ని కిలోమీటర్ల మేరకు రోడ్డును సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డుకు ఇరువైపులా గ్రీకు విగ్రహాలు, బంగారపు పూత పూసిన సింహాల బొమ్మలు, దేవతల రూపంలో ఉన్న జయ చిత్రాలు, వందల టన్నుల గులాబీ పూలతో ఆ మార్గాన్ని తీర్చిదిద్దారు. అతిథులకు వెండి ప్లేట్లు బహూకరించి మరో సంచలనానికి తెరతీశారు. దీంతో ఈ పెళ్లి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సుధాకరన్ వివాహం తర్వాతే జయపై సీబీఐ కన్ను పడింది. అక్రమాస్తుల కేసులు మొదలయ్యాయి. అప్పట్లోనే ఆ పెళ్లి కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అంచనా వేశారు.