: జయలలిత కన్నుమూసినట్టు తమిళ ఛానెళ్లలో ప్రసారం...కట్టలు తెంచుకున్న ఆగ్రహం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందారంటూ తమిళనాడుకు చెందిన పలు టీవీ ఛానెళ్లలో కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో అపోలో ఆసుపత్రి వద్దకు అన్నా డీఎంకే శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున క్యూకడుతున్నారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కనిపించిన వాటిని ధ్వంసం చేస్తూ దూసుకొస్తున్నారు. కాగా, వైద్యులతో చర్చల అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులోని టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న కథనాలు అవాస్తవమని అపోలో వైద్యులు ఖండించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆమె ప్రాణాలు కాపాడడానికి తమ ప్రయత్నం తాము చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద అంతకంతకూ ఊత్కంఠ పెరిగిపోతోంది. జయలలిత అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.