: పాఠం బోర్ కొడుతోందని ఆక్స్ ఫర్డ్ వర్శిటీపై భారత స్టూడెంట్ కేసు
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ... బ్రిటన్ లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన వర్శిటీ. ఇక్కడ సీటు పొందాలని కోరుకునే వారు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో వుంటారు. ఎందరో మహానుభావులు ఇక్కడ తమ తొలి పాఠాలను నేర్చుకున్నారు కూడా. ఇక ఇదే వర్శిటీలో పాఠాలు సరిగా చెప్పడం లేదని, అందుకే తాను డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకోలేదని భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి కోర్టును ఆశ్రయించాడు. వినేందుకు బోర్ కొట్టేలా పాఠాలు చెప్పడంతో తాను డిగ్రీలో సెకెండ్ క్లాస్ కే పరిమితం అయ్యాయని, తత్ఫలితంగా తన లాయర్ కెరీర్ సక్రమంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫయాజ్ సిద్ధిఖి అనే యువకుడు, ఇండియన్ ఇంపీరియల్ హిస్టరీని ప్రత్యేక సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. తనకు లెక్చరర్లు పాఠ్యాంశాలు సరిగ్గా చెప్పలేదని ఆరోపిస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించాడు. కాగా, ఈ కేసుకు సంబంధించిన తీర్పు జనవరిలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తాను ఫస్ట్ క్లాస్ లో పాసైవుంటే, అంతర్జాతీయ స్థాయిలో కమర్షియల్ లాయర్ గా ఎదిగి వుండేవాడినని సిద్ధికి చెబుతుండటం గమనార్హం.