: మోదీని నెత్తికెక్కించుకోబోము... కేసీఆర్, సిద్ధిపేట నా బలం: హరీశ్ రావు
తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామే తప్ప ప్రధాని నరేంద్ర మోదీని నెత్తికెక్కించుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాము మోదీకి మద్దతివ్వబోమని, అలాగే వ్యతిరేకించబోమని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత సమస్యల నుంచి తెలంగాణను ఎలా కాపాడాలన్న విషయమై ప్రణాళికలు రూపొందించేందుకు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ పైలట్ ప్రాజెక్టుగా సిద్ధిపేటను ఎంచుకున్నామని తెలిపారు. తన బలం ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సిద్ధిపేట ప్రజలు తనకు అండగా నిలిచినంత కాలం ప్రజలకు సేవలందిస్తానని హరీశ్ తెలిపారు. తనపై ఎంతో నమ్మకముంచిన కేసీఆర్ మిషన్ కాకతీయ ప్రాజెక్టును అప్పగించారని, ఆ ప్రాజెక్టు విజయవంతం కావడం సంతృప్తిని కలిగించిందని తెలిపారు. రైతు బజార్లలోని వ్యాపారులకూ స్వైప్ మెషీన్లు ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే తనకు వేదమని చెప్పిన హరీశ్, ఆయన ఏం ఆదేశించినా చేసేందుకు సిద్ధమని తెలిపారు.