: పుట్టిన రోజు పార్టీ అంటూ, జాతీయ స్థాయి షూటర్ పై కోచ్ అత్యాచారం!.. బాధితురాలి ఫిర్యాదు!
జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న షూటర్ ను ఆమె కోచ్ అత్యాచారం చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను బట్టి, జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకున్న ప్రముఖ షూటర్ ఈ ఫిర్యాదు చేసింది. తన పుట్టిన రోజు నాడు, పార్టీ ఇస్తానని చెప్పిన కోచ్, కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడని, ఆపై తనను అత్యాచారం చేశాడని ఆరోపించింది. నిందితుడు పలు అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్నాడని, తాను జాతీయ స్థాయిలో రాణించేందుకు సహకరించాడని బాధితురాలు పేర్కొంది. గతంలో తాము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన కోచ్, ఈ ఘటన తరువాత తనను బెదిరిస్తున్నాడని క్రీడాకారిణి ఫిర్యాదు చేసింది. షూటింగ్ ప్రాక్టీసులో భాగంగా తనను కాల్చి చంపి, ఆ ఘటనను ప్రమాదంగా చూపాలని అనుకుంటున్నాడని, బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఆరోపణలపై విచారిస్తున్నట్టు తెలిపారు.