: ఆ రూ. 2.5 లక్షల పాత నోట్లు ఎక్కడో?... అవి బ్యాంకులకు ఇకరావు: ఎస్బీఐ
ఇండియాలో ప్రజల వద్ద ఉన్నాయని భావిస్తున్న రూ. 2.5 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కావని భావిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న నాటికి ఇండియాలో రూ. 15.44 కోట్ల 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని గుర్తు చేస్తూ, బ్యాంకుల వద్ద ఉన్న నగదును పక్కకు తీస్తే, ఇప్పటికే రావాల్సిన మేరకు పాత కరెన్సీ బ్యాంకుకు వచ్చేసిందని, మరో రూ. 2.5 లక్షల కోట్ల పాత కరెన్సీ మాత్రమే ప్రజల వద్ద ఉందని తన తాజా విశ్లేషణ, అంచనాలతో కూడిన నివేదికలో బ్యాంకు ఎకనామిక్ రీసెర్చ్ విభాగం పేర్కొంది. ఈ డబ్బు తిరిగి వ్యవస్థలోకి వస్తుందని భావించడం లేదని తెలిపింది. ఎస్బీఐ అనలిస్టులు ఇచ్చిన వివరాల ప్రకారం, బ్యాంకుల వద్ద ఉన్న డబ్బు తీసేస్తే, రూ. 14.18 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉంది. నవంబర్ 10 నుంచి 27 మధ్య రూ. 8.44 లక్షల కోట్లు డిపాజిట్ కాగా, ఆపై వారం రోజుల వ్యవధిలో మరో రెండు లక్షల కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయి. బ్యాంకుల్లో పాత కరెన్సీ డిపాజిట్ చేసేందుకు మరో 26 రోజుల సమయం ఉంది. ఈ 26 రోజుల్లో ఇంకో లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ డిపాజిట్లు రావచ్చని, మిగతాది బ్యాంకులకు రాదని భావిస్తున్నామని ఎస్బీఐ పేర్కొంది. కాగా, నవంబర్ 10 నుంచి 18 వరకూ రూ. 6.05 లక్షల కోట్లు, ఆపై నవంబర్ 19 నుంచి 27 వరకూ రూ. 5.01 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయని ఈ నివేదిక పేర్కొంది.