: పైకి మాత్రమే విమర్శలు, మమతా బెనర్జీ మనసు నిండా మోదీపై అభినందనలే: బాబా రాందేవ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైకి మాత్రమే నగదు రద్దును వ్యతిరేకిస్తూ, విమర్శలు చేస్తున్నారని యోగా గురు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. కోల్ కతాలో జరుగుతున్న ఇన్ఫోకామ్ 2016 కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, నోట్ల రద్దుతో వ్యవస్థకు జరిగే లాభం గురించి ఆమెకు తెలుసునని, ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని మనసులో ఆమె మోదీని అభినందిస్తూనే ఉన్నారని అన్నారు. "ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కు ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఆమె కేవలం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ మాటలు అంటున్నారు. ఆమె చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. నేను నేలపై నిద్రస్తాను. ఆమె చిన్న గుడిసెలో ఉంటున్నారు. ఆమె కేవలం హవాయి చెప్పులు ధరిస్తారు. ఆమె ఆర్థిక పరిస్థితిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు" అని రాందేవ్ అన్నారు. మోదీ ఆలోచనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మెచ్చుకుంటున్నారని అన్నారు. తాను గతంలో ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు నల్లధనం గురించి చర్చించానని, అప్పుడే డీమానిటైజేషన్ పై తమ మధ్య చర్చలు జరిగాయని రాందేవ్ గుర్తు చేసుకున్నారు.