: సచిన్‌ని కిడ్నాప్ చేసి.. మా క్రికెటర్లకు ట్రయినింగ్ ఇప్పించాలి: డేవిడ్ కామెరూన్
భారత్ పర్యటనలో భాగంగా టీమిండియాతో పోరాడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఓటములను మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ పలు చలోక్తులు విసిరారు. టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కిడ్నాప్ చేసి, ఆయనతో ఇంగ్లండ్ టీంకు శిక్షణ ఇప్పించాలంటూ జోకులు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మిట్‌కి సచిన్ కూడా హాజరు కానున్నాడు. ఈ సందర్భంగా భారత్ సాధిస్తోన్న అభివృద్ధిని గురించి కూడా మాట్లాడిన కామెరూన్... తాను భారత్‌కు వచ్చిన ప్రతీసారీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నట్లు తెలిపారు. దీంతో సభలో హర్షధ్వానాలు మారుమోగిపోయాయి. భారత్, బ్రిటన్‌ల మధ్య చరిత్ర, సంస్కృతితో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులు ఆధారంగా "ఆధునిక భాగస్వామ్యం" పట్ల తాను ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొన్నారు.