: డబ్బు కోసం వెళ్తే... 'పెళ్లి క్యాన్సిల్ చేసుకో' అంటూ మేనేజర్ సలహా!


బ్యాంకుల్లో నోట్ల కొరత సామాన్యుల జీవితాల్లో అలజడి రేపుతోంది. తమకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదంటూ ఎంతో మంది కంటతడి పెడుతున్న సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, కర్నూలు జిల్లా పాణ్యంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జయమ్మ అనే మహిళ తన కుమారుడు సుబ్బకృష్ణ పెళ్లి పెట్టుకుంది. డిసెంబర్ 9న ఈ పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి ఖర్చుల కోసం గత 15 రోజులుగా రూ. 80 వేలను డ్రా చేసుకోవడానికి ప్రతి రోజూ బ్యాంకుకు ఆమె వెళుతోంది. గురువారం నాడు ఆమెకు రూ. 26 వేలు ఇచ్చారు. మిగిలిన నగదు కోసం వెళుతుంటే... పెళ్లి క్యాన్సిల్ చేసుకో అంటూ మేనేజర్ సీరియస్ గా సలహా ఇచ్చాడు. దీంతో, జయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే తమ పరువు పోతుందని... ఈ పరిస్థితుల్లో తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ వాపోయింది. మరోవైపు బ్యాంక్ మేనేజర్ తిక్కన్న మాట్లాడుతూ, బ్యాంక్ కు డబ్బు రావడం లేదని... తాము మాత్రం ఏం చేయగలమని చెప్పారు. మెయిన్ బ్రాంచ్ నుంచి డబ్బు అందాల్సి ఉందని తెలిపారు. ఏటీఎంల ద్వారా ఇప్పటివరకు రూ. 15 లక్షలు పంపిణీ చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News