: విజయవాడలో గొడవలు జరుగుతాయని ఎలా అంచనా వేస్తారు?: 'వంగవీటి' సినిమాపై వర్మ
విజయవాడలో జరిగిన ముఠా తగాదాల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వంగవీటి' సినిమా ఆడియో ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందు కోసం వర్మ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాపై చెలరేగుతున్న వివాదంపై ఆయన స్పందించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వంగవీటి సినిమా ఏ కులానికీ వ్యతిరేకం కాదని అన్నారు. సినిమా వల్ల మళ్లీ పాత రోజులు వస్తాయని, గొడవలు జరుగుతాయని వస్తోన్న వాదనలు నిజం కావని అన్నారు. సినిమాలో అభ్యంతరకరమంటున్న పాటను ఇప్పటికే తీసేశామని, మూవీలో మరే అభ్యంతరకర సీన్లు లేవని స్పష్టం చేశారు. సినిమాలో ఉన్న కథ అంతా వాస్తవమో కాదో సినిమా చూడకుండానే విమర్శలు చేస్తున్నారని వర్మ అన్నారు. సినిమా విడుదల కాకముందే సినిమాలో ఏముందో వారికెలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఒకరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. గొడవలు కావచ్చని ఎలా అంచనా వేస్తారని అడిగారు. సినిమా మొత్తం ఎమోషనల్ డ్రామాగా కొనసాగుతుందని చెప్పారు. వంగవీటి ఆడియో ఫంక్షన్‌కి విజయవాడ ప్రజలందరినీ ఆహ్వానించానని అన్నారు.