: ఆపిల్ భద్రత డొల్లే.. సెక్యూరిటీ లాక్‌ను తెరిచిన భారతీయ పరిశోధకుడు
ఆపిల్ ఐఫోన్లు, ఐపాడ్ల భద్రత డొల్లేనని తేలిపోయింది. వాటి సెక్యూరిటీ లాక్‌ను తెరిచేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని భారతీయ పరిశోధకుడు ఒకరు రుజువు చేశారు. ఆపిల్ ఐఫోన్‌లోని ఐవోఎస్‌లో 10.1లో ఉన్న ఓ బగ్ సాయంతో సెక్యూరిటీ లాక్‌ను ఓపెన్ చేసినట్టు కేరళకు చెందిన హేమనాథ్ జోసెఫ్ తెలిపారు. ఆపిల్ ఫోన్ తయారీలోని లోపాలను పరీక్షించేందుకు చేసిన తన ప్రయత్నాలు సఫలమైనట్టు ఆయన పేర్కొన్నారు. లాక్ అయిన ఓ ఆపిల్ ఐఫోన్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేశానని చెప్పుకొచ్చిన జోసెఫ్ లాక్ అన్‌లాక్ కోసం మొదట వైఫై నెట్‌వర్క్‌కు అనుసంధానం కావడం కోసం 'అదర్ నెట్వర్క్' ఆప్షన్ ఎంచుకుని దానికో పేరు ఇచ్చినట్టు వివరించారు. తర్వాత డబ్ల్యూపీఏ 2 కోడ్‌ను ఎంటర్ చేశానని తెలిపారు. ఈ కోడ్లలో వేలకొద్దీ క్యారెక్టర్లను ఎంటర్ చేయడంతో ఐఫోన్ ఫ్రీజ్ అయినట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఐఫోన్‌ను ఫ్రీజ్ చేసిన జోసెఫ్ తిరిగి ఇదే ప్రక్రియను ఉపయోగించి దానిని బలహీనం చేయడం గమనార్హం. ఫలితంగా ఐఫోన్ అన్‌లాక్ అయిందని వివరించారు. కాగా హేమంత్ కనిపెట్టిన బగ్ గురించి తెలిసిన ఆపిల్ దానిని సరిదిద్దింది.