: పవన్ కల్యాణ్ తో పొత్తుల గురించి చర్చించలేదు.. ప్రజా సమస్యల గురించే చర్చించాం: సీపీఐ రామకృష్ణ


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తుల గురించి చర్చించలేదని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రజా సమస్యలపై కలిసి పోరాడడంపై మాత్రమే చర్చించామని అన్నారు. అది పొత్తుల గురించి కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంతో కలిసి జనసేన పోరాడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నిన్న జనసేన కార్యాలయంలో సుమారు గంటన్నరపాటు ఇదే విషయంపై చర్చించామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా చర్చించామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, అధికారంలోకి రాగానే స్వరం మార్చడంపై చర్చించామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పేరుతో ఎకరాలకు ఎకరాలు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంపై కూడా మాట్లాడామని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో అవసరానికి మించినన్ని భూములు తీసుకుంటున్నారన్న తమ అభిప్రాయంతో పవన్ కల్యాణ్ కూడా ఏకీభవించారని ఆయన తెలిపారు. భవిష్యత్ లో ప్రజా సమస్యలపై పోరాటం చేయడంపై మాత్రమే చర్చించామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News