: వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలిచినా నేను సీఎం అవుతానో లేదో తెలియదు!: యూపీ సీఏం అఖిలేష్
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినా తాను సీఎం అవుతానో లేదో తెలియదంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ వైరాగ్య ధోరణిలో సమాధానమిచ్చారు. ఒక జాతీయ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పష్టంగా మాట్లాడారు. తన అడుగుజాడల్లోనే కొడుకులు నడవాలని ప్రతి తండ్రీ కోరుకోవడంలో తప్పులేకపోవచ్చు కానీ, ఆ విషయంలో తాను కొంచెం తేడా అని అన్నారు. తన తండ్రి మల్లయోధుడు కాగా, తాను మాత్రం ఫుట్ బాల్ ప్లేయర్ ని అని చెప్పుకొచ్చారు. కష్టాల్లో ఉన్నప్పుడే మన నిజమైన మిత్రులెవరో తెలుస్తుందని, సమాజ్ వాదీ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినా తాను మళ్లీ సీఎం అవుతానా? లేదా? అనేది చెప్పలేనని, నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన అఖిలేశ్, ప్రస్తుతం తనపై సాగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని మాత్రం ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ ఎంపీ అయిన అమర్ సింగ్ తో విభేదాలపై ఆయన స్పందిస్తూ.. ఆయన తనకు ‘అంకుల్’తో సమానమని, ఎస్పీ అధ్యక్షుడిని తానై ఉంటే కనుక, అమర్ సింగ్ విషయమై ములాయంకు సలహా ఇచ్చే వాడినని, ఆయనపై చర్యలకు వెనుకాడబోయేవాడిని కాదని అన్నారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి తనకు అక్కతో సమానమని, ఆమె హయాంలో జరిగిన అక్రమాలు యూపీలో ప్రతిఒక్కరికీ తెలుసని అన్నారు.