: లాలూ ప్రసాద్ కొడుకుతో 'పెళ్లి సంబంధం'పై స్పందించిన బాబా రాందేవ్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకుంటున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఖండించారు. లాలు పెద్ద కుమారుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు తన మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్టు రాందేవ్ బాబాపై కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన రాందేవ్ బాబా... ఇవన్నీ కట్టుకథలంటూ కొట్టి పారేశారు. ఓ వర్గానికి చెందిన మీడియా ఈ కథనాలను ప్రచారం చేసిందని చెప్పారు. నిన్న రాత్రి పాట్నాకు వచ్చిన బాబా రాందేవ్... లాలూ ప్రసాద్ తో సమావేశమయ్యారు. దీంతోనే ఈ కథనాలు వెలువడ్డాయి. దీనిపై బాబా స్పందిస్తూ, లూలూకి అస్వస్థతగా ఉందని తెలియడంతో ఆయనను పరామర్శించేందుకు వెళ్లానని చెప్పారు. అంతేకాని నోట్ల రద్దు గురించో, పెళ్లి సంబంధం గురించో, రాజకీయాలను మాట్లాడటానికో వెళ్లలేదని అన్నారు. లాలూ ఈ దేశ సంపద అని... ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరారు.