: నోట్ల రద్దు తరువాత భారీ స్కాములో కేజ్రీవాల్: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పాత నోట్లను మార్చుకునే భారీ స్కామ్ జరుగుతోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. పాత రూ. 500, రూ. 1000 నోట్లను మార్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ను వినియోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. నోట్ల రద్దును ప్రకటించిన తరువాత వెలుగులోకి వచ్చిన తొలి అతిపెద్ద కుంభకోణం ఇదేనని ఆయన ఆరోపించారు. తమ ఆదాయమంటూ రూ. 3 కోట్లను డీటీసీ డిపాజిట్ చేసిందని, ఇందులో అత్యధికం రద్దయిన నోట్లేనని ఆయన తెలిపారు. రూ. 5, రూ. 10 టికెట్లను అత్యధికంగా విక్రయించే డీటీసీ పెద్ద కరెన్సీని ఎలా డిపాజిట్ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని యాంటీ కరప్షన్ బ్రాంచ్ కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.