: రాష్ట్రపతి వద్దకు రాహుల్... వెళ్లి రమ్మని అభినందనలు చెప్పి పంపిన వెంకయ్యనాయుడు
నల్లధనాన్ని, లెక్కలో చూపని ధనాన్ని అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం చట్ట సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టిన వేళ, రాష్ట్రపతి వద్దకు రాహుల్ గాంధీ వెళ్లడాన్ని కేంద్రం ఎద్దేవా చేసింది. 16 పార్టీలకు చెందిన 25 మంది విపక్ష నేతలతో రాహుల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు వెళ్లగా, "వారికి నా అభినందనలు. గతంలో కూడా వారు రాష్ట్రపతిని కలిశారు. మరోసారి వెళుతున్నారు. వెళ్లి రానివ్వండి" అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా బిల్లును ఆమోదిస్తున్నట్టు ప్రకటించుకోవడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సంప్రదాయాలను అనుసరించలేదని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన మరో మంత్రి ప్రకాష్ జవదేకర్, చర్చకు తాము సిద్ధమని చెబుతున్నా, కాంగ్రెస్ సహా విపక్షాలు సభలో రభసకే ప్రాధాన్యమిచ్చాయని అన్నారు. కాగా, ఇది మనీ బిల్ అవడం వల్ల, లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, రాజ్యసభ 14 రోజుల్లో బిల్లును ఆమోదించి పంపాల్సి వుంది. అంటే, ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆదాయపు పన్ను చట్ట సవరణ పూర్తయ్యే అవకాశాలున్నాయి.