: ట్రంప్ అయినా మరొకరైనా ఒకటే అన్న ట్విట్టర్...ట్రంప్ స్పెషల్ అన్న ఫేస్ బుక్
ఒక విషయంలో మైక్రో బ్లాగింగ్ సైట్లు ట్విట్టర్, ఫేస్ బుక్ విభిన్నంగా స్పందించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్ ఏమన్నాయన్న వివరాల్లోకి వెళ్తే... అమెరికా అధ్యక్షుడైనా, సామాన్య పౌరుడైనా తమకు ఒకటేనని ట్విట్టర్ తేల్చి చెప్పింది. హింసాత్మక బెదిరింపులు, వేధింపులు, అసభ్యకర దూషణలు, విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలను ఖాతాల్లో పోస్టు చేస్తే...ఎవరి అకౌంట్ నైనా స్తంభింపజేస్తామని తెలిపింది. ఈ రూల్ వెరిఫైడ్ అకౌంట్లు, సాధారణ అకౌంట్లు.. ఎవరికైనా సరే వర్తిస్తుందని ట్విట్టర్ స్పష్టం చేసింది. తమ పాలసీని ఉల్లంఘించే ఏ ఖాతా అయినా నిలిచిపోతుందని ట్విట్టర్ తెలిపింది. ఇదే అంశంపై మరో మైక్రో బ్లాగింగ్ సైట్ పేస్ బుక్ పూర్తి విరుద్ధంగా స్పందించింది. ఫేస్ బుక్ లో కూడా హింసాత్మక బెదిరింపులు, వేధింపులు, అసభ్యకర దూషణలు, విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై నిషేధం ఉందని చెప్పింది. అయితే ఇది సాధారణ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఈ నిబంధనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వర్తించవని తెలిపింది. ట్రంప్ అభిప్రాయాలకు వార్తా ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఆయన పోస్టులకు ఎటువంటి నిబంధనలు వర్తించవని పేర్కొంది. దీంతో అమెరికన్లు ఫేస్ బుక్ ను ప్రశంసిస్తూ, ట్విట్టర్ ను విమర్శిస్తున్నారు. ట్విట్టర్ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఎవరికైనా ఒకటే రూల్ పాటించడం సమంజసమైన నిర్ణయమని పేర్కొంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.