: కులం వెలివేసింది... విధిలేని పరిస్థితుల్లో భార్య శవాన్ని పాత టైర్లతో దహనం చేశాడు!


సమాజంలో మానవత్వం లేకుండా పోతోందనే వాదనకు ఈ ఘటన మరో ఉదాహరణ. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో... అతని భార్య చనిపోయినా అంత్యక్రియలకు ఎవరూ రాలేదు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బోలాన్ గిరి జిల్లా తర్సుగూడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, భార్య సాజన (45) అనారోగ్యంతో బాధ పడుతుండగా మేఘభోయీ ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. వెంటనే మందులు తీసుకురావాలంటూ వైద్యులు చీటీ రాసిచ్చారు. అయితే మేఘభోయీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. బంధువులను అడిగితే డబ్బులు సాయం చేయలేదు. వేరే కులానికి చెందిన సాజనను పెళ్లిచేసుకున్నాడనే కారణంతో మేఘను కులం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో, చివరకు మందులషాపు యజమాని అప్పుపై మందులు ఇచ్చాడు. వాటిని తీసుకువచ్చేలోగానే సాజన చనిపోయింది. కానీ, అతని భార్యని తీసుకెళ్లడానికి కానీ, అంత్యక్రియలు నిర్వహించడానికి కానీ గ్రామంలోని వారు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో, భార్య శవాన్ని భుజాలపై ఎత్తుకుని ఒక్కడే శ్మశానవాటికకు పోయాడు. అనంతరం ఐదు పాత టైర్లు, ఎండిన ఆకులతో భార్య శవాన్ని దహనం చేశాడు.

  • Loading...

More Telugu News